అలెగ్జాండర్‌.. ఓ అద్బుతం,జయప్రకాష్ రెడ్డి నటజీవితం ధన్యం

updated: March 31, 2018 09:59 IST
అలెగ్జాండర్‌.. ఓ అద్బుతం,జయప్రకాష్ రెడ్డి నటజీవితం ధన్యం

నవలలను , నాటకాలను సినిమాలుగా ఎడాప్ట్ చేయటం కొత్తేమీ కాదు..అసలు వింతే కాదు..కాకపోతే అలెగ్జాండర్ నాటకాన్ని మాత్రం సినిమా చేయటం మాత్రం ఆశ్చర్యమే సాహసమే అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు నాటక రంగ చరిత్రలోనే కాకుండా తెలుగు చలన చిత్ర రంగం  లోనే ఇంత వరకు ఎవ్వరూ చేయని ప్రయోగం..రెండు గంటల పాటు   ఒకే ఒక పాత్ర తో సాగే సాంఘీక నాటిక అలెగ్జాండర్‌ . ఆ పాత్రను అద్బుతంగా రక్తికట్టించిన అద్వితీయ నటుడు  జయప్రకాష్ రెడ్డి. ఆయనే ఇప్పుడు దాన్ని సినిమాగా నిర్మించి అందులోనూ నటించారు..నటించారు కాదు ఆ పాత్రలో జీవించారు..ఆద్యంతం తన హావభావాలతో సందర్భోచిత మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ..కదలకుండా కట్టిపడేశారు.డైలాగ్స్ కానీ..నటన గానీ సీన్స్ గానీబాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఏదీ అతిగా అనిపించదు..వెండితెరమీద ఇది ఒక అద్భుత ప్రయోగాత్మక చిత్రమే అని చెప్పాలి.


వందలాది సినిమాల్లో విలన్ గా , కమేడియన్ గా , క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తన హావభావాలతో ఎన్నో పాత్రలను రక్తికట్టించిన జయప్రకాష్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రంగస్థలంపైనున్న మమకారంతో నాటకాలను ప్రదర్శిస్తూ  నాటక రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ 4 ఏళ్ల క్రితం గుంటూర్ లో jp's నెలా నెలా నాటకం నాటిక పేరిట ప్రతినెలా చివరి శనివారం ఆదివారం కళారంగ కళాకారులను ప్రోత్సహిస్తూ..తానూ రంగస్థలం మీద నటిస్తూ అందరి మన్నానలూ అందుకుంటున్నారు జెపి ఇంకా ఏదో చేయాలనే తపనతో తన విగ్రహానికి సరిపోయేటట్టు ‘అలెగ్జాండర్’ అనే పేరుతో సాంఘిక నాటకాన్ని ఎంచుకుని ప్రదర్శిచటం మొదలుపెట్టారు.


రచయిత కీ..శే..పూసల గారి కథ మాటలు..ఉత్తమాభిరుచి గల.ప్రముఖ దర్శకులు  శ్రీ ధవళసత్యం  దర్శకత్వంలో రూపొందిన ఈ నాటకం... ఏకధాటిగా వందనిమిషాలు ఒకే పాత్ర తో సాగుతుంది. అలా  వంద నిమిషాల పాటు అలుపు లేకుండా నటించడం చాలా కష్టం..అరుదు.  అలాగే ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంచటం ఓ పెద్ద విన్యాసం. అయితే అవన్నీ జయప్రకాష్ రెడ్డి అలవోకగా సాధించేసారు. ఆ నాటకాన్ని సినిమాగా చేయటం, రీసెంట్ గా ప్రివ్యూ వేయటం జరిగింది.ప్రముఖ సంగీతకారులు ల్.వైద్యనాథన్ గారి కుమారుడు ల్.గణేశన్ సంగీతం అదనపు సొబగు. మనో టిప్పు గీతాలాపన. ఈ చిత్రం ప్రివ్యూకు అద్బుతమైన స్పందన వచ్చింది. అలెగ్జాండర్ పేరుకు తగ్గట్టు నిండైన విగ్రహంతో జయప్రకాష్రెడ్డి తన పాత్రకు  జీవం పోశారు. 


అలెగ్జాండర్ అనే పేరు వినగానే ఇదేదో చారిత్రకం అనే భ్రమ కలుగుతుంది..కానీ ఇది సాంఘికం.  ఏకపాత్రాభినయంకి  భిన్నంగా.. నేపధ్యంలో చాలా పాత్రలను సృష్టించి రంగస్థలంపై కన్పించకపోయినా వారితో సంభాషించేటట్టు  చేయడం ఈ నాటకం లేదా ప్రయోగాత్మక సినిమా ప్రత్యేకత.  ఇటువంటి వాటిని తెలుగు నాటక లక్షణాల్లో ‘బాణం ’ అంటారు.   

కథేంటి...???

ఆర్మీలో మేజర్‌ అలెగ్జాండర్ ..పదవీ విరమణ అనంతరం సమాజం లో సాటివారి సమస్యలకు తగిన పరిష్కారాలిస్తూ ప్రేరణ కలిగిస్తూ హెల్ప్ లైన్ ద్వారా సంభాషిస్తుంటారు. భార్య లిజా మృతిచెందినా ఆమె స్మృతులను నెమరువేసుకుంటూ అమెరికాలో స్థిరపడిన కొడుకు.. తమవద్దకు రమ్మన్నా తన స్వేచ్ఛకు ఆశయానికి భంగం కలుగుతుందని పరాయిగడ్డపై అవమానాలు వద్దనుకుని, సొంతగడ్డపై ఆఖరి శ్వాస వరకూ బతకాలనుకుంటాడు. 

తన విశ్రాంత జీవితం ఇతరులకు సలహాలు ఇవ్వడం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటుచేసి ఆర్తులకు.. అన్ని వయసులవారికీ.అన్ని వర్గాలవారికీ సరైన సలహాలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో హెల్ప్‌లైన్‌లో వచ్చే సంభాషణలకు అనుగుణంగా అలెగ్జాండర్ హావభావాలు , మధ్యలో సూదుల్లా గుచ్చుకునే పదునైన మాటలతో  సాగుతుంది.  సమాజంలో పలు అంశాలను స్పృశిస్తూ మీడియాపై, పోలీసులపై, రాజకీయ నాయకులపై చెణుకులు, చురకలు అంటిస్తూ ఈ సినిమా సాగుతుంది. రచయిత పూసల రాసిన పదునైన సంభాషణలని అంతకు మించిన  టైమింగ్‌తో జయప్రకాష్‌రెడ్డి పలుకుతున్నప్పుడు  హర్షద్వానాలు చేయకుండా ఉండలేం. 

విదేశాల్లో బిజీ జీవితం గడుపుతూ తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో వారు పడే అవస్థలు, మద్యపానం వల్ల కలిగే కష్టనష్టాలు, రాజకీయ నాయకులు తెరవెనుక చేసే కుట్రలు కుతంత్రాలు, మహిళా సంఘాల రాజకీయాలు, పోలీసులపై సెటైర్లు, చిత్ర విచిత్ర వార్తాకథనాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ వాటి రేటింగ్ పెంచుకునేందుకు టివి ఛానెళ్లు చేసే ప్రయత్నాలు, మీడియా వల్ల జరిగే అనర్థాలు, అనుమానాలతో విడిపోతున్న కుటుంబాలు, పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రేమికులు, మాతృభాష గొప్పదనం,తెలుగు భాష ఉనికి కోసం తపన పడే తెలుగు మాస్టారు ఆశయం.. 

వీధిబడుల విలువ, మమ్మి, డాడీల సంస్కృతి విడనాడాలని, కళాశాలల్లో ర్యాగింగ్ వంటి పలు సమస్యలకు పరిష్కారం ఈ సినిమాలో  చూపించారు. (చెప్పారు)

సమకాలీన సామాజిక సమస్యలన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. సాటివారికి సహాయం చేయాలని,  సమస్యలకు సానుభూతి చూపటం కాకుండా   పరిష్కారం చూపాలనే అద్బుతమైన సందేశంతో  సినిమా ముగుస్తుంది. 


ఎలా ఉందంటే...

ఇందులో ప్రతీ సన్నివేశం...డైలాగులు మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. ఇంత మంచి సినిమా థియేటర్ లలో ప్రదర్శనకు నోచుకోకపోవడం..చాలా బాధగా అనిపిస్తుంది. ఆస్కార్ కు పంపే స్దాయి ఉన్న ఈ సినిమా కు ప్రాంతీయ,జాతీయ అవార్డ్ లు మాత్రం రావటం ఖాయం. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఎఎన్నార్, లకు తను ఏ మాత్రం నటనలో తీసిపోనని, తగ్గనని జెపీ గారు నిరూపించిన చిత్రం ఇది. ఈ సినిమా చూస్తూంటే ఇంతకాలం ఆయనలో ప్రతిభను  సినిమావాళ్లు పూర్తి స్దాయిలో ఆవిష్కరించలేదని అర్దమవుతుంది. 

ఈ సినిమా చూసిన కమిడయన్ టార్జాన్...తడారిన గొంతుతో..ఈ సినిమాని నేనే రిలీజ్ చేస్తాను అవకాశం ఇస్తే.. అని అన్నారు. 


ఏదైమైనా డబ్బై ఏళ్ల వయస్సులో కూడా మనిషి అనుకుంటే సమాజానికి ఏ విధంగా అయినా సేవ చేయచ్చు ... అని జెపీ గారు చేసిన పాత్ర మనని ప్రేరేపిస్తూనే ఉంటుంది. హ్యాట్సాఫ్ జేపీ గారు..మీలాంటి నటుడు మన తెలుగులో ఉండటం మా అదృష్టం. ఇక ఈ చిత్రానికి.. సీనియర్ దర్శకుడు ధవళ సత్యం గారు..చాలా బాలెన్సెడ్ గా నాటకాన్ని చక్కగా తెరకెక్కించి ప్రశంసలు పొందారు.తెరవెనుక పాత్రల గాత్రాలు..అందరికీ పరిచయమైన నటులు వ్యాఖ్యాతలు..రావికొండలరావు గారు కీ. శే. రాధాకుమారి గారు..anchorsసుమ ఝాన్సీ..యాక్టర్స్..సన కొండవలస రఘుబాబు విగ్రహాల రామారావు తదితరుల.ప్రివ్యూ చూసాక ప్రముఖ నటులు దర్శకులు రచయితలు ఎంతోమంది వారి వారి స్పందన చక్కగా తెలియజేశారు.. 

ఈ ప్రివ్యూ కి హాజరు ఐన ప్రముఖుల లో  ప్రముఖ నటులు రావి కొండల రావు గారితో పాటు , కమెడియన్లు చిట్టిబాబు, నటరాజ , షఫీ , టార్జాన్ ,శ్రీగిరి, వాయిస్ ఆరిస్ట్  కృష్ణవేణి శఠకోపన్  ఉన్నారు   

ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీశాఖ మంత్రులు..ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు..కళా సాంస్కృతిక శాఖ పెద్దలు..పెద్ద మనసుతో ఈ చిత్రాన్ని చూసి స్పందించి తగిన విధం గా ప్రోత్సహించి..ఈ చిత్రానికి పురస్కారాలు అందే దిశగా కృషి చేయాలని ఆశిస్తున్నారు అశేష ప్రేక్షకులు..తెలుగు సినీ పరిశ్రమ వర్గం..అప్పుడే ఈ తరానికి ఇలాంటి ప్రయోగాత్మక.సందేశాత్మక చిత్రాలు తీయాలనే ఆలోచన..ఉత్సాహం ..ప్రేరణ కలుగుతుంది...అలెగ్జాండర్ కి..విజయానికి ..అందరి హెల్ప్లైన్ అవసరం.

comments