'మనసంతా నువ్వే' దర్శకుడుతో హోమ్ లీ క్లబ్ సినిమా

updated: March 3, 2018 22:28 IST
'మనసంతా నువ్వే'  దర్శకుడుతో హోమ్ లీ క్లబ్ సినిమా

పవన్ కళ్యాణ్ నటించిన 'గుడుంబా శంకర్' చిత్రం గుర్తుందా...? ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన వీరశంకర్ చాలా రోజుల తర్వాత మరో ప్రయోగాత్మకమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ  చిత్రానికి 'మనసంతా నువ్వే' సినిమా దర్శకుడు వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించడం విశేషం. "అలా నేను.. ఇలా నువ్వు" పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రపంచంలోనే తొలి హోం థియేటర్ చిత్రంగా పేర్కొన్నారు నిర్మాత. 

హోమ్‌ థియేటర్ల ఓనర్ల కోసం మరెక్కడా దొరకని, ఎక్కడా ఉపయోగించని, వారి కోసం మాత్రమే వినోదాన్ని అందించే ప్రయత్నం తాము చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే దాదాపు కోటీ డెబ్భై అయిదు లక్షల రూపాయల బడ్జెట్‌ తో ‘అలా నేను... ఇలా నువ్వు’ అనే సినిమాను ఇప్పుడు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య నిర్దేశకత్వం వహించే ఈ చిత్రానికి వీరశంకర్‌ కథ, కథనం అందిస్తున్నారు. రాజ్‌ కందుకూరి సమర్పణలో వీరశంకర్‌ సిల్వర్‌ స్ర్కీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రం నిర్మాణం కానుంది. 

దర్శక, నిర్మాత మారుతి ఇష్టపడి రాసిన టైటిల్‌ లోగోను, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల విశాఖపట్నంలో ఆవిష్కరించారు. శనివారం నాడు ఈ సినిమాను పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. సాయి రోనక్‌, అమృతా అయ్యర్‌ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం రేవు పోలవరంలో హీరో హీరోయిన్ల ఇంటి సెట్‌ను భారీ వ్యయంతో నిర్మిస్తుండడం విశేషం. ఈ వేసవిలో చిత్రం షూటింగ్‌ పూర్తి చేసి, రానున్న జూలై నాలుగున విడుదల చేయాలన్నది మా ప్రయత్నం అని వీరశంకర్‌ చెప్పారు.

comments